ఏడెనిమిది గంటలు కూర్చొనే పని చేయడం, తగ్గిపోయిన నిద్రవేళలు, సరైన సమయానికి ఆహారం తీసుకోక పోవడం. ఇవన్నీ నేటి ఉద్యోగులకు బరువును పెంచే అంశాలుగా మారాయి. మరి వీటికి విరుగుడు శారీరక శ్రమ చేయడమే. అందుకోసం రోజు కనీసం ఓ అరగంట వ్యాయామం చేయాలి..

నడక… ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఎముక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. బరువు తగ్గడానికి సాయపడుతుంది. కీళ్ల ఆరోగ్యానికి, ఊపిరితిత్తుల సామర్థ్యానికి దోహదం చేస్తుంది. ఓ అధ్యయనంలో రోజూ 30 నిమిషాలు నడిచిన వారిలో 40శాతం తుంటి ఎముకలు విరగడం తగ్గిందని తెలిసింది. మరో విషయమేటంటే.. దీనికి ఎలాంటి పరికరాలు అక్కర్లేదు.

పరుగు.. రోజూ అర గంట తప్పకుండా నడిచే వారు మరింత ఆరోగ్య వృద్ధి కోసం నడకను కాస్త పరుగుగా మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. పరుగు శరీరంలోని కొవ్వును సమర్థంగా కరిగిస్తుంది. అలాగే పొట్టను తగ్గిస్తుంది. సౌకర్యవంతమైన బూట్లని అమర్చుకోవడం మాత్రం తప్పనిసరి.

సైకిల్ తొక్కడం.. శారీరక శ్రమ, బరువు… ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం తెలుసుకోవడానికి పరిశోధకులు 18000 మంది పై, 16 ఏళ్లు పరిశోధనలు చేశారు. ఈ సమయంలో సాధారనంగా మానవులు దాదాపు 20 పౌండ్ల బరువు పెరగగా రోజూ దాదాపు అరగంటపాటు శారీరక శ్రమ చేసే వారి బరువు ఇతరుల కన్నా తగ్గినట్లు తెలిసింది.

ఈత… శరీరానికంతటికీ చక్కటి వ్యాయామమిది. హృదయ స్పందన రేటును మెరుగుపరుస్తుంది. అలాగే కండరాలను టోన్ చేస్తుంది కూడా. కీళ్లనొప్పులున్న వారికి కూడా ఇది అనుకూలం.

యోగా.. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్నిచ్చే వ్యాయామం . ఒత్తిడి, బరువును తగ్గిస్తుంది.