పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండే పదార్థాలన్నీ క్యాన్సర్‌ను నివారించేవే. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, దాదాపు అన్ని రకాల కాయగూరలు. తాజా పండ్లు, పొట్టుతీయని ముడిధాన్యాలు (హోల్ గ్రెయిన్స్)లో పీచు పుష్కలంగా ఉంటుంది. కానీ మాంసాహారంలో పీచు చాలా తక్కువ కాబట్టి మాంసాహారం తినే వారిలో మలబద్దకం లాంటి సమస్యలు ఎక్కువ. అందుకే మాంసాహారాన్ని తగ్గించి, తాజా ఆకుకూరలు, కాయ గూరలు, పొట్టుతో ఉండే అన్ని ముడిధాన్యాలు, తృణ ధాన్యాలను మన ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్ నివారణ చాలా సులభం.
అలాగే పొట్టుతో పాటు తినదగ్గ పండ్ల (ఆపిల్, జామ లాంటివాటిని) తొక్క తీయకుండా తినడమూ మేలు చేస్తుంది. పండ్లలోని యాంటీఆక్సిడెంట్ల వంటి వాటితో పాటు… ఈ పొట్టులోనే ఉండే ‘కెర్విటిన్’ అనే ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. ఇక మొక్కలు, పండ్లు, అన్ని శాకాహార పదార్థాల్లో ఉండే ఫైటోకెమికల్స్ అన్నీ క్యాన్సర్‌ను తుద ముట్టించేవే. వీటన్నింటికీ మించి ఉల్లి, వెల్లుల్లికి ఘాటును ఇచ్చే ‘అల్లిసిన్’ వంటి జీవరసాయాలన్నీ క్యాన్సర్ ను పారదోలేవే. అలాగే ఎర్రటి రంగులో ఉండే టొమాటో లాంటి పండ్లలోని ‘లైకోపిన్’ అనే పోషకంతో పాటు రకరకాల రంగుల కూరగాయల్లో ఫైటో కెమికల్స్ అన్నీ క్యాన్సర్‌తో పోరాడేవే.