415 కి.మీ. మెట్రో విస్తరణ సాధ్యమే
నగర జనాభా 2 కోట్లకు పెరిగినా ఇబ్బందులుండవ్‌సీఎం కేసీఆర్ ఆదేశాలతో మూడోదశలో కొత్త మార్గాల ప్రతిపాదన: ఎన్వీఎస్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: నగరం నలువైపులా మెట్రోరైలు విస్తరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఇందులో 69 కి.మీ. ఇప్పటికే మూడు మార్గాల్లో అందుబాటులోకి రాగా… మిగిలిన పనులను 15 మార్గాల్లో చేపట్టనున్నారు. నగరంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి సూచనలతో మెట్రో విస్తరణ ప్రణాళికలు రూపొందించామని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ప్రతిపాదిత కొత్త కారిడార్ల ప్రిలిమినరీ ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ (పీపీఆర్), డీపీఆర్ రూపొందించనున్నట్లు బేగంపేటలోని మెట్రోరైలు భవన్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. మొదటిదశలో మిగిలిపోయిన పాతబస్తీ మెట్రో 5.5 కి.మీ. పనులు త్వరలో మొదలవుతాయని చెప్పారు. 415 కి.మీ. భారీ విస్తరణ నగరంలో సాధ్యమేనన్నారు. భవిష్యత్తులో జనాభా 2 కోట్లకు పెరిగినా ట్రాఫిక్ సమస్యలు లేకుండా విస్తరణ ప్రణాళికలు తయారు చేశామన్నారు. మెట్రో విస్తరణకు అవసరమయ్యే రూ.69,100 కోట్లను జైకా, ఇతర సంస్థల నుంచి అతి తక్కువగా 3 శాతం వడ్డీకే రుణాలు పొందే సౌలభ్యం ప్రభుత్వానికి ఉంది. విమానాశ్రయ మెట్రోను రీడిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు 20 కి.మీ. ఇప్పటికే టెండర్ దశలో ఉంది. మిగిలిన 136 కి.మీ.లను నాలుగు మార్గాలుగా ప్రతిపాదించారు. ఇందులో 37 కి.మీ. భూమార్గం గుండా మెట్రో వెళుతుంది. మిగతా భాగం ఎలివేటెడ్‌లో ఉంటుంది. మొత్తం రూ.20,180 కోట్లు అవుతుందని అంచనా.
అక్కినేని నాగేశ్వర రావు తొలుత బేగంపేటలో ఉండేవారని.. ట్రాఫిక్ రద్దీ పెరగడంతో బంజారాహిల్స్‌కు నివాసాన్ని మార్చుకున్నారని, తర్వాత జూబ్లీహిల్స్‌కు వెళ్లారని.. ఇలాంటి ట్రాఫిక్ ఇబ్బందులుండరాదంటే మెట్రో అన్ని మార్గాల్లో అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో తరచూ చెప్పేవారని ఎన్‌వీఎస్‌రెడ్డి చెప్పారు.
1. ఓఆర్‌ఆర్ శంషాబాద్ కూడలి-తుక్కుగూడ-బొంగ్లూరు-పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్ వరకు 40 కి.మీ.
రావిర్యాల, హార్డ్‌వేర్ పార్క్, ప్యాబ్‌సిటీ, కొంగరకలాన్, వండర్‌లా, టీసీఎస్ ఆదిభట్ల, తొర్రూర్, రామోజీ ఫిల్మ్‌సిటీ వరకు.
2. ఓఆర్‌ఆర్ పెద్ద అంబర్‌పేట- ఘట్‌కేసర్ – శామీర్‌పేట – మేడ్చల్ వరకు 45 కి.మీ.
తారామతిపేట, గౌరెల్లి, కీసర, ఇన్ఫోసిస్, కరీంగూడ రోడ్, కీసరగుట్ట, యాదగిరిపల్లిరోడ్డు, మునీరాబాద్ వంటి ప్రధాన ప్రాంతాలకు.
3. ఓఆర్‌ఆర్ మేడ్చల్- దుండిగల్- పటాన్‌చెరు వరకు 29 కి.మీ.
శేరిగూడెం, సుల్తాన్‌పూర్, సీఎంఆర్ ఇనిస్టిట్యూట్, గౌడవెల్లి, ఎంఎల్‌ఆర్ ఇనిస్టిట్యూట్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, మల్లంపేట రోడ్డు దాకా.
4. ఓఆర్‌ఆర్ పటాన్‌చెరు – కోకాపేట- నార్సింగి వరకు 22 కి.మీ.
ఈదులనాగులపల్లి, వట్టినాగులపల్లి, కొల్లూరు, శంకర్‌పల్లి రోడ్, నియోపోలీసు, ఓషన్ పార్క్, గండిపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, ఐఎస్‌బీ వరకు.