కడుపునొప్పికి కారణాలు.. నివారణ
పితాశయంలో రాళ్లు…
గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్లు ఏర్పడినప్పుడు పొట్ట కుడివైపు పై భాగంలో నొప్పి వస్తుంది. ఒక్కోసారి కుడి భుజం దగ్గర, వెనకాల కూడా నొప్పి ఉంటుంది. టైంకి తినకపోవడం, డీహైడ్రేషన్ వల్ల పిత్తాశయంలో ఈ రాళ్లు ఏర్పడతాయి. అంతేకాదు ఎసిడిటీ ఉందని నీళ్లు తాగరు చాలామంది. దాంతో పిత్తాశయంలో రాళ్లు వస్తాయి. కొన్నిసార్లు రక్తహీనత వల్ల కూడా ఎసిడిటీ ఉంది.
హియటస్ హెర్నియా…
కొన్ని సార్లు ఛాతిలో నొప్పితో బాధపడతారు కొందరు. దీన్ని హార్ట్ బర్న్ అంటారు. అన్నవాహిక, జీర్ణాశయం కలిసే ప్రాంతాన్ని జి-ఇ జంక్షన్ (గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్) అంటారు. అందరిలో ఇది మూసుకుని ఉంటుంది. అయితే కొందరిలో పుట్టుకతో లేదా అలవాట్ల కారణంగా ఈ జంక్షన్ తెరచి ఉంటుంది. డయాబెటిస్, ఒబెసిటీ సమస్య ఉన్నా ఇలా జరుగుతుంది. తిన్న వెంటనే నిద్రపోయేవాళ్లలో ఛాతిలో మంటగా ఉండడానికి కారణం. ఈ జంక్షన్ సరిగా మూసుకోకపోవడం వల్ల పొట్టలోని యాసిడ్స్, బైల్స్ వంటివి అన్నవాహికలోకి వస్తాయి. దీన్ని ‘
హియటస్ హెర్నియా’ అంటారు. దాంతో ఛాతిలో మంట అనిపిస్తుంది. అందుకని తిన్న వెంటనే కాకుండా రెండు గంటల తర్వాత నిద్రపోవాలి. మరికొందరికి తిన్న గంట రెండు గంటలకే వాంతులు అవుతాయి. ఇలా జరుగుతుంటే కనుక ఆపరేషన్ అవసరం పడుతుంది.
అల్సర్లు వస్తాయిలా…
ఎసిడిటీ సమస్య అలాగే ఉంటే అల్సర్లకు దారితీస్తుంది. పేగుల్లోని మందమైన మ్యూకస్ పొర తగ్గినప్పుడు అల్సర్స్ వస్తాయి. వీటిని ‘గ్యాస్టిక్ అల్సర్స్’ అంటారు. కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా వీటికి కారణమవుతాయి. కడుపంతా నొప్పి ఉంటుంది. బరువు తగ్గుతారు. వికారం, వాంతులు లక్షణాలు కనిపిస్తాయి.
డయాగ్నసిస్…
ఎండోస్కోపీ, కొలనోస్కోపీతో పాటు అల్టాస్కోపీ కూడా చేస్తారు. ఆహార జాగ్రత్తలతో పాటు యాంటాసిడ్ మందులు వాడితే ఎసిడిటీ రెండు నుంచి మూడు వారాల్లో తగ్గిపోతుంది.
ఈ జాగ్రత్తలు ముఖ్యం… ఉదయం 8 గంటల లోపు, మధ్యాహ్నం 2 లోపు, రాత్రి 8 గంటల లోపు భోజనం చేయాలి. జంక్ ఫుడ్ బదులు అటుకులు, నట్స్, డ్రైఫ్రూట్స్ తో తయారుచేసిన శ్నాక్స్ తినిపిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మంచి బ్యాక్టీరియా తగ్గితే…… జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది… తిన్న ఆహారం తొందరగా అరిగేలా చేయడమే కాకుండా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఫ్యాట్, చక్కెర ఉండే ఫుడ్ ఈ బ్యాక్టీరియాని తగ్గిస్తాయి. మంచి బ్యాక్టీరియా తగ్గితే తరచూ కడుపు నొప్పి వస్తుంది. పెరుగు తిననివాళ్లలో, నీళ్లు బాగా తాగని వాళ్లలో ఈ సమస్య ఎక్కువ. అందుకని ప్రొబయాటిక్స్ ఉండే పెరుగు తినాలి.