గోంగూరతో లాభాలు
రేచీకటి వంటి దృష్టి లోపంతో బాధపడే వారు భోజనంలో తరచూ గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. రేచీకటి సమస్యతో బాధపడే వారు ఇలా గోంగూరను తీసుకుంటూనే గోంగూర పువ్వులను దంచి వాటి నుండి తీసిన అర కప్పు రసాన్ని అర కప్పు పాలతో కలిపి తీసుకోవడం వల్ల సమస్య త్వరగా నయం అవుతుంది.
రుచిగా ఉండడంతో పాటు గోంగూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. గోంగూరను తరుచూ తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయి. శరీరంలోని వాపులను, రేచీకటిని, బోదకాలు సమస్యను, శరీరంలో ఉన్న వ్రణాలను తగ్గించడంలో దివ్యౌషధంగా గోంగూర పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూరను అన్నంతో కలిపి తిన్నా కూడా విరేచనాలు తగ్గుతాయి. దగ్గు, ఆయాసం, తుమ్ముల వంటి శ్వాస కోస సంబంధిత సమస్యలతో బాధపడే వారికి గోంగూర ఎంతగానో ఉపయోగపడుతుంది. గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల వెంటనే ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. గోంగూరలో విటమిన్ ఎ, బి1 బి2, బి9 లతోపాటు విటమిన్ సి కూడా అధిక మొత్తంలో ఉంటుంది.
గోంగూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఇందులో అధికంగా ఉండే విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గోంగూరలో క్యాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. గోంగూరను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గడంతోపాటు ఎముకలు కూడా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. గుండె, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో కూడా గోంగూర మనకు ఉపయోగపడుతుంది.