కాలేయానికి ప్రధాన శత్రువులు హెపటైటిస్ దినం హెపటైటిస్ వైరస్లు వీటిల్లో ఎ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలున్నాయి. హెపటైటిస్ ఎ, ఇ ఇన్ఫెక్షన్లు చాలావరకు వాటంతటవే తగ్గిపోతాయి. మామూలు కామెర్లు వీటితో వచ్చేవే. కానీ బి, సి వైరస్లు ప్రమాదకరమైనవి. ” ఆందోళనకరమైన విషయం ఏంటంటే- హెపటైటిస్ బారినపడ్డవారిలో నూటికి 70 మందికి ఆ విషయమే తెలియకపోవటం. జబ్బు బాగా ముదిరిన తర్వాతే బయట పడటం. ఈ నేపథ్యంలో హెపటైటిస్ పై అవగాహన కలిగుండటం మంచిది.

హెపటైటిస్ ‘ఎ’: దీని బారినపడ్డవారి లో జ్వరం, అస్వస్థత, ఆకలి లేకపోవటం, విరేచనాలు, వికారం, కడుపులో ఇబ్బంది, మూత్రం ముదురు రంగులో రావటం.. చర్మం, కళ్లు పసుపురంగులోకి మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో హెపటైటిస్ మళ్లీ తిరగబెట్టొచ్చు . అపరిశుభ్ర వాతావరణంలో నివసించేవారికి, సురక్షిత నీరు అందుబాటులో లేనివారికి, హెపటైటిస్ ఇన్ ఫెక్షన్ గలవారితో జీవించేవారికి, స్వలింగ సంపర్కులకు దీని ముప్పు ఎక్కువ.

హెపటైటిస్ ‘బి’: దీని బారినపడ్డవారిలో మొదట్లో పెద్దగా లక్షణాలేవీ ఉండవు. కొందరిలో కళ్లు, చర్మం పచ్చబడటం, కొద్దిగా జ్వరం, అలసట, వికారం కడుపునొప్పి, కీళ్ల నొప్పుల వంటివి కనిపించొచ్చు అక్యూట్ దశలో పెద్దగా మందుల అవసరమేమీ ఉండదు. ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే పోషకాహారం, విశ్రాంతి తీసుకుంటే చాలు. వాంతులు, తీవ్రమైన నిస్సత్తువ, ఆకలి లేకపోవటం వంటివి గలవారికి రక్తనాళం ద్వారా ద్రవాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు 80% మందిలో వైరస్ కూడా దానంతటదే తొలగిపోతుంది. అయితే కొందరిలో దీర్ఘకాల (క్రానిక్) సమస్యగా మారొచ్చు.

హెపటైటిస్ ‘సి’ : తొలిదశలో అంతగా లక్షణాలేవీ ఉండవు. ఫ్లూ జ్వర లక్షణాలు, అలసట, వికారం, కామెర్ల లక్షణాలు, కీళ్ల నొప్పులు, ఆందోళన, కడుపునొప్పి, ఆకలి లేకపోవటం వంటివి ఉండొచ్చు. ఇది చాలామందిలో దీర్ఘకాలిక ఇన్ ఫెక్షన్ గా మారుతుంది. కొందరిలో ఐదేళ్లలోనే కాలేయ సమస్యలు తలెత్తోచ్చు. కొందరికి కాలేయం గట్టి పడటం వంటి తీవ్ర సమస్యలు తలెత్తటానికి 20 ఏళ్లకు పైగా పట్టొచ్చు కూడా.

హెపటైటిస్ ‘ఇ’ : ఈ ఇన్ ఫెక్షన్ గలవారి మలంతో కలుషితమైన నీటితో వైరస్ – వ్యాపిస్తుంది. మొదట్లో కొద్దిగా జ్వరం, ఆకలి తగ్గటం, వికారం కనిపిస్తాయి. కొందరికి కడుపునొప్పి, కీళ్ల నొప్పులూ తలెత్తోచ్చు. హెపటైటిస్ ఇ ఇన్ ఫెక్షన్ చాలా వరకు 2-6 వారాల్లో అదే తగ్గిపోతుంది. అరుదుగా తీవ్రం కావొచ్చు

నివారణ ముఖ్యం : కలుషిత ఆహారం, నీటికి దూరంగా ఉంటే హెపటైటిస్ ఎ, ఇ సోకకుండా చూసుకోవచ్చు. హెపటైటిస్ బి గలవారి రక్తం, శారీరక స్రావాల ద్వారా వైరస్ సోకుతుంది. ఇతరులు ఉపయోగించిన సూదులు, ఇంజెక్షన్లు, బ్లేడ్లు, టూత్ బ్రషుల వంటివి వాడుకోకూడదు. హెపటైటిస్ బికి టీకా అందుబాటులో ఉంది. హెపటైటిస్ సి ప్రధానంగా రక్తం ద్వారానే వ్యాపిస్తుంది. కాబట్టి రక్తమార్పిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.