నిద్ర అనేది సాధారణమైన విశ్రాంతి మాత్రమే కాదు, రేపటి రోజు కోసం శరీరాన్ని సమాయత్తం చేసే ప్రక్రియ అది. నిద్ర సరిగ్గా లేకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు శాస్త్ర వేత్తలు. ముఖ్యంగా గుండె జబ్బుల మీద నిద్రలేమి ప్రభావాన్ని బేరీజు వేసేందుకు అమెరికా పరి శోధకులు 6,820 మంది జీవనశైలిని గమనించారు. తమకు తాముగా నిద్రకు సంబంధించి ఫలానా సమస్య ఉంది అని గుర్తించిన వారికి గుండె జబ్బులు వచ్చే ఆస్కారం 54 శాతం ఎక్కువగా ఉండటాన్ని గమనించారు. ఈ సమస్యను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు 639 మందికి నిద్రను కొలిచే పరికరాలు అమర్చారు.

నిద్రపోతున్న సమయం, మధ్యలో మెలకువలు, గాఢత లాంటి ఎన్నో దశలను ఈ పరికరాల ద్వారా గుర్తించవచ్చు. ఆశ్చర్యంగా చాలామందిలో నిద్రకు సంబంధించిన సమస్యలు కనిపించాయి. వారిలో గుండె జబ్బు వచ్చే ప్రమాదం 141 శాతమని తేలింది. ఆ ఫలితాల ఆధారంగా మన అనారోగ్యం, ఒత్తిడి నిద్ర మీద ప్రభావం చూపిస్తున్నాయని, అవి గుండె జబ్బులకు దారితీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.