వర్షాకాలం (Monsoon)లో చాలామందికి రోగ నిరోధక శక్తి సహజంగానే క్షీణిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి రకరకాల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. అందుకే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. ఇతర పోషక ఆహారాలతో పాటు మొక్కజొన్నను (Corn) ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే రోగ నిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు.

మొక్కజొన్నలో విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాల వల్ల జుట్టు ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. తెల్ల జుట్టు లేదా గ్రే హెయిర్ సమస్యలు కూడా దరిచేరవు. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ ఎ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ ఎ రోగనిరోధక వ్యవస్థ కణాల యాక్టివిటీని కూడా పెంచుతుంది. మొక్కజొన్నలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది…

క్యాన్సర్, గుండె జబ్బుల వంటి వ్యాధులను దూరం చేస్తుంది. అంతేకాదు, ఎముకలు దృఢంగా మారతాయి. మొక్కజొన్నలో ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల వీటిని తరచూ తీసుకుంటే మలబద్దక సమస్యల నుంచి పూర్తిస్థాయిలో ఉపశమనం కలుగుతుంది. వీటిని తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అప్పుడు అతిగా ఆహారాలు తినబుద్ది కాదు. తద్వారా బరువు తగ్గడం సాధ్యమవుతుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మెరుగు పడతాయి.