రాత్రి నిద్రతోనే మంచి ఆరోగ్యం
రాత్రి రెండైనా కంటిపై కునుకు రాదు అనే వారికి ఆఫీస్ పనితో పగలు నిద్ర కుదరదు. దాంతో తరచూ నీరసం, పని చేయాలంటే నిరుత్సాహం. సమయానికి నిద్ర పోకపోతే అది జీవక్రియలపై చెడు ప్రభావం చూపెడుతుంది అంటున్నారు మాస్టిచ్ విశ్వవిద్యాలయ (నెదర్ల్యాండ్స్) పరిశోధకులు. వారి పరిశోధన తాజాగా డయాబెటాలజియా జర్నల్ లో ప్రచురణ అయ్యింది. పగటి, రాత్రి నిద్రకు తేడా ఉందని, జీవక్రియలపై ఇది ప్రభావం చూపిస్తుందని పేర్కొంటోందీ నివేదిక.
రాత్రి నిద్ర… రోజంతా అలసిన శరీరానికి నిర్ణీత సమయంలో నిద్రను అలవరచాలి. తగినంత నిద్ర ఉంటే శరీరం తిరిగి శక్తిని పుంజుకుంటుంది. పలు రకాల అనారోగ్యాలకు దానికదేచికిత్స చేసుకొనే శక్తి శరీరానికి ఉంటుంది. అంతేకాదు, జీవక్రియల్లో మార్పులు చోటు చేసుకోకుండా ఉండాలన్నా రాత్రి సమయాల్లో నిద్ర అత్యంత అవసరం. పగటి పూట నిద్రపోతున్నామనే భావన సరైనది కాదు. ఎందుకుంటే ఈ రెండు నిద్రలకూ చాలా తేడా ఉంటుందని అధ్యయనంలో తేలింది. రాత్రి నిద్రతోనే ఆరోగ్యం. రాత్రి నిద్ర మాత్రమే జీవక్రియలను సమన్వయం చేయగలదు. లేదంటే తీసుకున్న ఆహారంలోని పోషకాలను శరీరానికి శక్తిగా మార్చి అందించే ఈ ప్రక్రియలో మార్పులు చోటు చేసుకుంటాయి. రాత్రి కంటినిండా నిద్రపోతే, అది మెదడు పనితీరునూ మెరుగుపరుస్తుంది. తత్ఫలితంగా మానసికాందోళనలు వంటివి దరి చేరవు. పగటి వెలుతురు ప్రభావం నిద్రపై ఉంటుంది. దీంతో కంటినిండా నిద్రలేక అధికబరువు సమస్య దరిచేరుతుంది.
ప్రయత్నించాలి.. నిద్రలేమి సమస్య ఉన్నవారు వారం రోజులు ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించాలి. వెలుతురెక్కువగా లేకుండా ప్రశాంత వాతావరణాన్ని కల్పించుకోవాలి. నచ్చిన సంగీతాన్ని వినాలి. ఇష్టమైన పుస్తకాన్ని చదివినా క్రమేపీ మెదడు విశ్రాంతి దశలోకి వెళుతుంది. ఉదయం/ సాయంత్రం శారీరక శ్రమనిచ్చే నడక, వ్యాయామం, తోట పని వంటివి కల్పించుకోవడం మంచిది. ఇవి కండరాలను అలిసేలా చేస్తాయి. దాంతో నిద్ర సహజంగానే వస్తుంది. నిద్రరావడం లేదంటూ ఫోన్ చేతిలో ఉంచుకోకూడదు. నిద్రకు గంట ముందుగానే గ్యాడ్జెట్ల వినియోగాన్ని ఆపేస్తే చాలు. ఈ ప్రయత్నాలతో పాటు అవసరమైతే వైద్యుల సలహాను తీసుకోవాలి. రాత్రి పూట కంటి నిండా నిద్రపోతే ఆరోగ్యంగా, ఉత్సాహంగా రోజంతా గడపొచ్చు.