రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకున్న వారు అధిక బరువు సమస్య నుంచి బయటపడినట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. వీటితో గ్యాస్ అనుకుంటే నానబెట్టి, ఉడికించి తీసుకుంటే మంచిది. గుప్పెడు శనగలు ఎన్నో పోషకాలను అందించడమే కాదు, పొట్ట నిండిన భావన కలిగిస్తాయి. వీటిలోని ప్రొటీన్లు, పీచు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. దీంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఇది బరువు సమస్యను దరిచేరనివ్వదు.

శనగల్లో పుష్కలంగా వృక్షాధార ప్రొటీన్లుండటంతో శాకాహారులకు ఇవి పోషకాహారం. వీటిలోని ‘సి’ విటమిన్ శరీరం ఇనుమును పీల్చుకునేలా దోహదపడుతుంది. వీటిలో పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెంపులో తోడ్పడటమే కాకుండా, అనారోగ్యాలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. మలబద్ధకానికి దూరంగా ఉంచుతుంది. శనగలు శరీరంలో అధిక కెలోరీలను తగ్గిస్తాయి.

అమ్మవారికి నైవేద్యంగా ఉంచే శనగలు పోషకాల గనులు. ఇవి అధికబరువును తగ్గించడమే కాదు, ఆరోగ్యపరంగా ఇంకా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. మహిళల్లో ఎక్కువగా కనిపించే ఇనుము లోపం సమస్యను శనగలను తీసుకోవడం ద్వారా దూరం చేయొచ్చు. కప్పు శనగల్లో 26 శాతం ఇనుము ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ఇనుము ప్రాధాన్యత ఎక్కువ. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి.

వీటిలో ప్రొటీన్లు, కొవ్వు, కార్బొహైడ్రేట్లు సహా మాంగనీస్, కాపర్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలుంటాయి. ఫోలేట్, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. రోజూ చిన్న కప్పు శనగలను తీసుకుంటే నిండైన ఆరోగ్యంతో ఉండొచ్చు. వీటిలోని పీచు, ప్రొటీన్లు రక్తంలో గ్లూకోజు స్థాయులను సమన్వయం చేస్తాయి. టైప్2 డయాబెటిస్ను దరిచేరకుండా పరిరక్షిస్తాయి.