Gurajada Apparao
Gurajada Venkata Apparao was a noted Indian playwright, dramatist, poet, and writer known for his works in Telugu theatre. Rao wrote the play Kanyasulkam in 1892, which suhas considered the greatest play in the Telugu language
గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 – 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. అతనుకు కవి శేఖర అనే బిరుదు కూడా ఉంది.
గురజాడ అప్పారావు విశాఖ జిల్లా, యస్.రాయవరం లో, మేనమామ ఇంట్లో 1862 సెప్టెంబరు 21 న, వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. అతనికి శ్యామలరావు అనే తమ్ముడు ఉన్నాడు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో పేష్కారుగా, రెవిన్యూ సూపర్వైజరు గాను, ఖిలేదారు గానూ పనిచేసారు. తన పదవ ఏట వరకు అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నారు. తర్వాత, వారి తండ్రి కాలం చెయ్యటంతో, విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాలా పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో అప్పటి ఎమ్. ఆర్. కళాశాల ప్రధానాధ్యాపకులు సి. చంద్రశేఖర శాస్త్రి ఇతన్ని చేరదీసి ఉండడానికి చోటిచ్చారు. 1882లో మెట్రిక్యులేషను పూర్తిచేసి, తర్వాత 1884లో ఎఫ్.ఎ చేసారు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయునిగా చేరారు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి అతనుకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను యస్.రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.
వివాహం-సంతానం
1885లో అప్పారావు అప్పల నరసమ్మగారిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం – ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు. 1887లో మొదటి కుమార్తె ఓలేటి లక్ష్మి నరసమ్మ జన్మించింది. 1890లో కుమారుడు వెంకట రామదాసు, 1902లో రెండవ కుమార్తె పులిగెడ్డ కొండయ్యమ్మ జన్మించింది.
ఉద్యోగాలు
అప్పటి కళింగ రాజ్యంగా పేరుపొందిన విజయనగరంలోనే అప్పారావు నివసించారు. విజయనగర సంస్థాన పూసపాటి గజపతి రాజులతో అతనుకు మంచి సంబంధాలు ఉండేవి. 1887లో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అతను మొదట ప్రసంగించారు. ఇదే సమయంలో సాంఘిక సేవకై విశాఖ వాలంటరీ సర్వీసులో చేరారు. 1889లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో తమ్ముడు శ్యామలరావుతో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాసారు. వీరు రాసిన ఆంగ్ల పద్యం సారంగధర, ఇండియన్ లీషర్ అవర్ (Indian leisure hour)లో చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. అప్పుడే కలకత్తాలో ఉన్న రీస్ అండ్ రోయిట్ ప్రచురణకర్త శ్రీ శంభుచంద్ర ముఖర్జీ విని, అప్పారావును తెలుగులో రచన చేయడానికి ప్రోత్సహించారు. ఆంగ్లంలో యెంత గొప్పగా వ్రాసినా అది పరభాషేనని, తన మాతృభాషలో వారు ఇంకా గొప్పగా వ్రాయగలరని అతడన్నాడు. ఇండియన్ లీషర్ అవర్ ఎడిటరు గుండుకుర్తి వెంకట రమణయ్య కూడా అతనిని ఇదే త్రోవలో ప్రోత్సహించాడు. 1891లో విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకునిగా గురజాడ నియామకం పొందారు.
1897లో మహారాజా ఆనంద గజపతి చిన్న వ్యాధితో కాలం చేసినప్పుడు, రీవా మహారాణి, అప్పల కొండమాంబ గారికి వ్యక్తిగత కార్యదర్శిగా అప్పారావు నియమితుడయ్యారు. 1884లో మహారాజా కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1886లో డిప్యూటీ కలెక్టరు కార్యాలయంలో హెడ్ క్లర్కు పదవినీ, 1887లో కళాశాలలో అధ్యాపక పదవినీ నిర్వహించారు. 1886లో రాజా వారి ఆస్థానంలో చేరారు. 1911లో మద్రాసు యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో సభ్యత్వం లభించింది.
కన్యాశుల్కము
గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కము నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించారు (కచ్చితమైన సంవత్సరం తెలియ రాలేదు). ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కము, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కము తొలి కూర్పును మహారాజా ఆనందగజపతికి అంకితమిచ్చారు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కము రెండవ కూర్పును 1909లో రచించారు.[1]
1892లో గురజాడ వారి కన్యాశుల్కము నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. సాంఘిక ఉపయోగంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడవచ్చని ఈ నాటకం నిరూపించింది. దీని విజయంతో, అప్పారావు ఈ ఆలోచన సరళిని అవలంబించి ఇతర సాహిత్యకర్తలను వెదకసాగారు. ఈ సరళికి అతని చిన్ననాటి స్నేహితుడు చీపురుపల్లిలో తన సహాధ్యాయి అయిన గిడుగు రామమూర్తి ముఖ్యుడు. వాడుక భాష ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రశంసించడంతో అప్పారావుకు ఎంతో పేరు వచ్చింది. 1896లో ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టారు. 1897లో కన్యాశుల్కాన్ని వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు వారు ప్రచురించారు. అప్పారావు దీన్ని మహారాజా ఆనంద గజపతికి అంకితం ఇచ్చారు. 1909 ఆరోగ్యం కుదుట పడడానికి నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కన్యాశుల్కం తిరగ రాసారు. 1910లో రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది. 1911లో మద్రాసు విశ్వవిద్యాలయం బోర్డు అఫ్ స్టడీస్‌లో నియమించబడ్డారు. అదే సంవత్సరంలో, స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రారంభించారు.
20వ శతాబ్ది తొలినాళ్ళలో జరిగిన వ్యవహారిక భాషోద్యమంలో గురజాడ అప్పారావు తన సహాధ్యాయి గిడుగు రామమూర్తి పంతులుతో కలిసి పోరాటం సలిపారు. వారిద్దరూ కలిసి పత్రికల్లో, సభల్లో, మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంథిక భాషావాదులతో అలసట ఎరగకుండా తలపడ్డారు. గిడుగు వాదనాబలానికి, గురజాడ రచనాశక్తి వ్యావహారిక భాషోద్యమానికి వినియోగపడ్డాయి.[1].
Gurajada Apparao
Date of Birth: 21 Sep 1862
Birth Place: Vishakhapatnam
Proffession: Indian playwright
Nationality: Indian
Death: 30 November 1915, Vizianagaram