Viswanatha Satyanarayana
Viswanatha Satyanarayana was a 20th-century Telugu writer. His works included poetry, novels, dramatic play, short stories and speeches, covering a wide range of subjects such as analysis of history,
విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబర్ 10, 1895 – అక్టోబరు 18, 1976) “కవి సమ్రాట్” బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.
20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. అతను చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు – కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు – అతను పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. అతను మాటలలోనే “నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును ” అతను వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును [1].
విశ్వనాథ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించారు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పారు – “ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా అతను చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో అతనుదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం – ఈ వ్యక్తిత్వం.”
విశ్వనాథ 1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి)[3] ) కృష్ణా జిల్లా నందమూరు (ఉంగుటూరు మండలం) లో జన్మించారు. విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతి. అతనుది తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబం. శోభనాద్రి జీవితం చాలా వరకూ వైభవోపేతంగా సాగిన చివరి దశలో దాతృత్వ గుణం వల్ల దారుణమైన పేదరికాన్ని అనుభవించారు. విశ్వనాథ సత్యనారాయణ తన చిన్నతనంలో సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించారు. అతను మాటల్లో చెప్పాల్సి వస్తే మరీ చిన్నతనంలో నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ.[4] అనంతర కాలంలో శోభనాద్రి కేవలం అంగవస్త్రము, పంచె మాత్రమే సర్వవస్త్రాలుగా మిగిలాకా కూడా దానాలిచ్చి దూసిన స్వర్ద్రువై మిగులు ధోవతినొక్కడు దాల్చిన స్థితిలో జీవించాల్సి వచ్చింది.[4]. తండ్రి శోభనాద్రి మంచి భక్తుడు, అతను వారణాసి వెళ్ళి గంగానదిలో స్నానం చేయగా దొరికిన విశ్వేశ్వరస్వామి లింగాన్ని తీసుకువచ్చి స్వగ్రామమైన నందమూరులో ప్రతిష్ఠించి ఆలయం కట్టించారు. అతను ప్రభావం తమపై విపరీతంగా వుందని విశ్వనాథ సత్యనారాయణ అనేకమార్లు చెప్పుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణలోని దాతృత్వము, భక్తి వంటి సుగుణాలు తండ్రి నుంచి వచ్చినవేనని చెప్పుకున్నారు[నోట్ 1] విశ్వనాథ సత్యనారాయణ బాల్యంలో అతను పుట్టిపెరిగిన గ్రామం, దానిలో దేశికవితా రీతులతో గానం చేసే భిక్షుక బృందాలూ, పురాణగాథలు నేర్చి ప్రవచించడంతో నిత్యమూ గడిపే స్వజనమూ అతను కవిత్వానికి పునాదులు వేశాయని చెప్పవచ్చు.
విద్యాభ్యాసం
విశ్వనాథ సత్యనారాయణ విద్యభ్యాసము ఎన్నో ఆటంకాల నడుమ సాగింది. ప్రాథమిక విద్యను నందమూరు, ఇందుపల్లి, పెదపాడు గ్రామాల్లో అభ్యసించారు. పై చదువు బందరు పట్టణంలో సాగింది. బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించారు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన ప్రముఖ కవి, పండితుడు. అతను వద్ద బందరు పాఠశాలలో విద్యార్థులుగా చదువుకున్న వారు అనంతర కాలంలో మహా పండితులుగా, మహాకవులుగా ఆంధ్రదేశంలో సుప్రఖ్యాతి పొందడం విశేషం. వారిలో విశ్వనాథ సత్యనారాయణ అగ్రగణ్యులు. చెళ్ళపిళ్ళ తమకు నిత్యం పాఠ్యప్రణాళిక ప్రకారం, సమయానికి వచ్చి పాఠాలు చెప్పినవారు కారనీ, ఐతే తమకు తోచిన సమకాలీన పండిత చర్చలు పిల్లలకు బోధిస్తూ శాఖాచంక్రమణంలో ఎన్నెన్నో భాషా, సాహిత్య విశేషాలు వివరించి తుదకు గొప్ప పండితులుగా శిష్యులను తీర్చిదిద్దారని విశ్వనాథ వ్రాశారు.[6] [నోట్ 2] విశ్వనాథ సత్యనారాయణ కళాశాలలో చదువుతూండగా 1921లో మహాత్మాగాంధీ పిలుపుమేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేందుకు కళాశాలను వదిలివేశారు. తండ్రి చనిపోయి కుటుంబం దుస్థితిని అనుభవిస్తున్నా అతను ఈ సాహసం చేశారు. 1921 నుంచి 1926 వరకూ బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. మధ్యలో వదిలివేసిన బి.ఎ.ను తిరిగి 1926-27లో పూర్తిచేసి, బందరు హిందూ కళాశాలలో అధ్యాపకునిగా చేరారు.
1916 లో “విశ్వేశ్వర శతకము”తో విశ్వనాథ రచనా ప్రస్థానము ప్రారంభమైనది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆసమయంలోనే “ఆంధ్రపౌరుషము” రచించాడు. 1920 నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.
తరువాత విశ్వనాథ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది. మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు – ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించాడు. అతను రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించారు. 1961లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసాంగానికి కేటాయించారు.
ప్రముఖ బెంగాలీకవి రవీంద్రనాధ టాగూరు వలె తన రచనలను కొన్నింటినైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకొంటే, అతను అంతర్జాతీయ ఖ్యాతినార్జించి ఉండేవాడని అతను అభిమానులు అంటుంటారు. అయితే విశ్వనాథ రచనలను విశ్లేషించే విమర్శకుడు అతను తాత్విక స్థాయిని అర్ధం చేసుకొంటే గాని సాధ్యం కాని విషయం [1]
పాత్ర చిత్రణ
విన్నూత్న, విశిష్టమైన పాత్ర చిత్రణకు విశ్వనాథ పెట్టింది పేరు. ఆయా సందర్భాన్నిబట్టి, సన్నివేశాన్ని బట్టి పాత్రల మనస్త్వత్తాన్ని విశ్లేషించుకుంటూ స్వయం వక్తిత్వంగల పాత్రలుగానూ, స్వయం ప్రకాశవంతమయిన పాత్రలుగానూ, మహత్తరమయిన, రమణీయమయిన శిల్పాలుగాను తీర్చి దిద్దారు. అందునా వారి స్త్రీ పాత్ర చిత్రణ అద్భుతం!
ముఖ్య రచనలు
విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి – ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి. తెలుగు తనమన్నా, తెలుగు భాష అన్నా విశ్వనాథకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి అతను మొదటి రచనలలోనివి. విశ్వనాథ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి.
తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పారు. ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నారు. తమిళనాడులోని మదురై ప్రాంతం నేపథ్యంలో వచ్చిన నవల “ఏకవీర”ను పుట్టపర్తి నారాయణాచార్యులు మళయాళంలోనికి, అంబటిపూటి హనుమయ్య తమిళంలోనికి అనువదించారు. ఏకవీర సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాకు సి.నారాయణరెడ్డి మాటలు, పాటలు సమకూర్చాడు. వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు “సహస్రఫణ్” పేరుతో హిందీ లోకి అనువదించారు. భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి. కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశారు. విశ్వనాథ నవలలలో పురాణవైర గ్రంథమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతతో నిండిన కథ, అనితరమైన అతను శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.
Viswanatha Satyanarayana
Date of Birth: 11 Sep 1895
Birth Place: Nandamuru
Proffession: Writer
Nationality: Indian
Death: 18 October 1976, Guntur