కాంగ్రెస్, బీజేపీ జల పాపాలు
తెలంగాణకు ఒకరిది ద్రోహం
మరొకరిది తీవ్రమైన నిర్లక్ష్యం
వాటి స్వార్థం వల్లే ఈనాటి దుస్థితి
సమైక్య రాష్ట్రం నుంచీ తప్పని గోస
ఎన్నడూ నిలదీయని కాంగ్రెస్ గణం
ఎప్పుడూ గొంతెత్తని కాషాయ దళం
దశాబ్దాలుగా దక్కని జల న్యాయం
మొక్కవోని దీక్షతో టీఆర్‌ఎస్ పోరు
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తలాపునే గోదావరి, పాదాల చెంత కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా మడులు తడవవు.. జనాల దాహం తీరదు! సమైక్య రాష్ట్రంలో తెలంగాణ జలగోస ఇది! ఇప్పటికీ అదే యాతన! వర్షాలు పడి నీళ్లొస్తే తప్ప, న్యాయమైన వాటాకు దిక్కేలేదు! ఉమ్మడి రాష్ట్రంలో తమ పార్టీయే దశాబ్దాలపాటు అధికారంలో ఉన్నా.. తెలంగాణ ప్రాంత హక్కుల కోసం ఇక్కడి కాంగ్రెస్ నేతలు నోరు మెదిపింది లేదు! విభజన అనంతరం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు కేంద్రం సాయం పేరుతో ఉద్ధరించేస్తున్నామని జబ్బలు చరుచుకుంటున్న బీజేపీ నాయకులు నదీజలాల సమస్యలపై దృష్టిసారించిందీ లేదు! పరిష్కారానికి చొరవ చూపిందీ లేదు. ఈ రెండు పార్టీల నిర్వాకం వల్ల.. తెలంగాణ నేటికీ తన న్యాయమైన నీటి హక్కులపై పోరాడాల్సిన పరిస్థితి దాపురించింది.
కాంగ్రెస్‌ది విద్రోహం..
వద్దంటున్నా హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్రతో కలిపిన తర్వాత ఉమ్మడి ఏపీని దీర్ఘకాలం పాలించింది కాంగ్రెస్సే. ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేసి, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను పక్కన పడేయడంతో జరిగిన నష్టం అంతాఇంతా కాదు. ఆంధ్ర పొలాలకు నీళ్లు పారితే చాలనుకున్న అప్పటి సమైక్య ప్రభుత్వం.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా సీమాంధ్ర ప్రాంతానికి నదీ జలాలను ధారపోసింది. ఆ క్రమంలోనే పోతిరెడ్డిపాడు అక్రమంగా పురుడు పోసుకున్నది. ఫలితంగా పాలమూరు తన నీటి హక్కులను కోల్పోయి వలసల జిల్లాగా మారింది. నల్లగొండలో ఫ్లోరైడ్ భూతం వికటాట్టహాసాలు చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో రాష్ట్ర సాధన కోసం జనం ఉద్యమిస్తున్న వేళ సైతం తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదు. అందుకు ఎన్నో నిదర్శనాలు.జలయజ్ఞంలో తెలంగాణకు భారీ నష్టాలను చేకూర్చే ప్రాజెక్టులను నాటి సీఎం వైఎస్ చేపడుతున్నా ఇక్కడి కాంగ్రెస్ నేతలు నోరెత్తలేదు.
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఏకంగా నాలుగింతలు పెంచి, 30 రోజుల్లోనే 120 టీఎంసీల కృష్ణా నీటిని ‘వరద జలాల’ పేరిట రాయలసీమ, ఆంధ్రకు తరలించుకుపోతుంటే చేష్టలుడిగి చూశారు.
‘కృష్ణా బేసిన్‌లో ఉన్న నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు 77.50 టీఎంసీల అదనపు జలాలను కేటాయించి, బేసిన్‌లో లేని సీమాంధ్రకు 150 టీఎంసీలను తరలించుకుపోతే మారు మాట్లాడలేదు.
రాయలసీమ ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి 30 రోజుల్లో నీరు వదలాలని, తెలంగాణ ప్రాజెక్టులకు 90 రోజుల్లో వదలొచ్చని సమైక్య ప్రభుత్వం రూలు పెడితే.. ఇక్కడి కాంగ్రెస్ నాయకత్వం చప్పట్లు కొట్టింది.
రాష్ట్ర ఆవిర్భావ వేళ జలాలను పునఃపంపిణీ చేయాల్సి ఉన్నది. కానీ.. ఆంధ్రనేతల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం అప్పటికే వినియోగంలో ఉ న్న నదీ జలాలనే ప్రాజెక్టులవారీగా పంపిణీ చే యాలని సెక్షన్ 89ను పొందుపరిచింది. ఇక్క డి కాంగ్రెస్ నాయకులు ఏమిటీ అన్యాయం అని ప్రశ్నించే సాహసం చేయలేదు.
బేసిన్ అవతలి ప్రాంతాల్లోని ఏపీ ప్రాజెక్టులైన గాలేరు-నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, వెలిగొండకు చట్టబద్ధత కల్పించారుగానీ.. పూర్తిగా బేసిన్‌లోనే ఉన్న పాలమూరు-రంగారెడ్డి, డిండి, ఎస్సెల్బీసీ ప్రాజెక్టులను మాత్రం చేర్చలేదు. వాటినీ చేర్చాలని తెలంగాణ సమాజం పట్టుబట్టినా ప్రజల పక్షాన ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కలిసిరాలేదు.
విభజన తర్వాత కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నాయకులు నిలబడకపోగా.. నీటి గోస తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు అడ్డం పడ్డారు. పాలమూరు- రంగారెడ్డి, డిండి, మల్లన్నసాగర్, అనంతగిరి, మిడ్‌మానేరు, గౌరవెల్లి ప్రాజెక్టులపై లెక్కకు మించి కేసులు వేయడంతో పాటు గ్రీన్‌ట్రిబ్యునల్‌కు ఆశ్రయించి విమర్శలు ఎదుర్కొన్నారు.
టీఆర్‌ఎస్ మొక్కవోని జలసంకల్పం
తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటా కోసం నాడు ఉద్యమనేతగా, నేడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ మొక్కవోని పోరాటం చేస్తున్నారు. నాడు పోతిరెడ్డిపాడు విస్తరణకు వ్యతిరేకంగా నినదించారు. పాదయాత్రలు చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తూ, మరోవైపు న్యాయమైన నీటివాటాను వినియోగించుకునేందుకు నూతన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. కృష్ణా బేసిన్‌లో ఉమ్మడిరాష్ట్రంలో మొదలై దశాబ్దాలు గడిచినా పూర్తికాని కోయిల్‌సాగర్ , భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఉదయ సముద్రం, గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్ రెండో దశ, శ్రీరాంసాగర్ వరద కాలువ, ఎల్లంపల్లి, మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం) ప్రాణహిత-దేవాదుల, కంతానపల్లి, అలీసాగర్, గుత్ప తదితర అనేక ప్రాజెక్టులను స్వల్పకాలంలో పూర్తిచేశారు. గోదావరి, కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మరికొన్ని ప్రాజెక్టులను రీడిజైన్ చేయడంతోపాటు వాటి పనులను పరుగులు పెట్టిస్తున్నారు.
బీజేపీ నిర్లక్ష్యం..
తెలంగాణ ప్రయోజనాలను మంటగలపడంలో బీజేపీది అంతులేని నిర్లక్ష్యం. తెలంగాణ ఏర్పడినప్పటినుంచీ బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివక్షను ప్రదర్శిస్తూనే ఉన్నది. నీళ్లలో వాటా కోసం ఏడేండ్లుగా తెలంగాణ సర్కారు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పెడచెవిన పెడుతు న్నది. ఏపీ ప్రభుత్వానికి కోరిన వెంటనే వరాలిస్తున్నది. ఇప్పుడు ఏకంగా రాష్ట్రం నీటి హక్కులను కాలరాసేలా బోర్డుల పరిధిని నిర్దేశించి, అమలుకు పూనుకొన్నది.
అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 లోని సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేసి, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేసీఆర్ ఏడేండ్లుగా కోరుతున్నా.. తాత్సా రం చేస్తున్నది. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు నోరే ఎత్తరు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల్‌శక్తి శాఖ ఆమోదం తెలిపిన పరిస్థితుల్లో నాగార్జునసాగర్ ఎగువ ప్రాంతం అంటే తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనంగా 45 టీఎంసీలను కేటాయించాలని 1976లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డును ప్రకటించింది. దీనిపై తెలంగాణ ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం మొద్దు నిద్రలోనే ఉన్నది.
తాగునీటికి కేటాయించిన జలాల్లో 80% తిరిగి నదిలోకే వస్తాయి కనుక తాగునీటికి కేటాయించిన నీళ్లలో 20 శాతాన్నే పరిగణనలోకి తీసుకోవాలని బచావత్ ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. దాని ప్రకారం.. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేటాయించిన 16 టీఎంసీల కృష్ణా జలాల్లో 20% (3.3 టీఎంసీలు) పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం దీనిని అమలు చేయదు.. రాష్ట్ర బీజేపీ నేతలు అమలు చేయాలని కోరరు.
ఏటా తెలంగాణ వాడుకోకుండా మిగిల్చిన కృష్ణా జలాలను క్యారీ ఓవర్‌గా పరిగణించి తర్వాతి నీటి సంవత్సరంలో వినియోగించుకునే వెసులుబాటును కల్పించాలని మొరపెట్టుకుంటున్నా బీజేపీ సర్కారు దానిని ఆలకించడం లేదు.
ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన సీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కుడి కాలువ పనులను సత్వరమే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. సీమ ఎత్తిపోతలపై పర్యావరణ ఉల్లంఘనల నివేదిక ఇవ్వాలని సాక్షాత్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించినా ఇప్పటికీ కేంద్రం నివేదిక సమర్పించలేదు.
కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ 2016లో అవార్డును ప్రకటించింది. దానిని ఇప్పటివరకు నోటిఫై చేయలేదు. ఆ ట్రిబ్యునల్ ఇరు రాష్ర్టాలకు నీటి కేటాయింపులను ప్రాజెక్టుల వారీగా పూర్తి చేయాల్సి ఉన్నది. కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నది. నీటి కేటాయింపులు పూర్తికాకుండానే విభజన చట్టం పేరిట ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను బోర్డులకు కట్టబెట్టేందుకు గెజిట్‌ను జారీ చేసింది.